|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కుమార శతకం
శ్రీ భామినీ మనోహరు
సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్
లోఁభావించెద; నీకున్
వైభవము లోసగుచుండ వసుధఁకుమారా!
భావం : కుమారా! సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి మనసు చూరగొన్నవాడు! సౌభాగ్యాలను దయతో ఇచ్చే స్వభావం గలవాడు, నాభిలో పద్మంగల విష్ణువు, నీకు భూమి పై వైభవాలు ఇస్తుండగా ప్రార్ధిస్తున్నాను.
ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్,
బ్రాజ్ఞులలోఁబ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా!
భావం : నిన్ను చేయమని నియమించిన పనులను తెలివితో, లోకంలోని ప్రజలంతా మెచ్చేట్లు చేయాలి. నీ బుద్ధి నైపుణ్యం నీవు ప్రదర్శించడమే కాక, తెలివైన వారిలో నీవు తెలివైన వానిగా, పేరు గడిస్తు అభివృద్ధి చెందు.
అతి బాల్యములో నైనను,
బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స
ద్గతి మీర మెలగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా!
భావం : కుమారా! చిన్నతనంలోనైనా సరే అపమార్గం తొక్కవద్దు. చెడ్డపనులు చేయవద్దు. మంచి పనులే చేయి. మంచి మార్గం అనుసరించేవారు సుఖంగా ఉంటారు.
వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచు బూత చరితుడున్
సద్ధర్మశాలియని బుధు
లిద్ధరఁబొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!
భావం : పెద్దలను గౌరవించేవానిని, మంచి బుద్ది కలవారనీ, బాగా తెలివి తేటలు గలవాడనీ, ధర్మం తెలిసిన వానినీ జనులు ఈ లోకంలో పొగుడుతారు.
పెద్దలు వద్దని చెప్పిన
పద్దుల బోవంగరాదు పరకాంతల నే
పొద్దే నెదబరికించుట
కుద్దేశింపగఁగూడ దుర్వి కుమారా!
భావం : కుమారా! పెద్దలు వద్దు అని చెప్పిన పనులు చేయవద్దు. ఈ భూమిలో ఇతర స్త్రీలను ఎప్పుడైన మనసులో తలచవద్దు.
తనపైదయ నుల్కొన గను
గొను నేతెంచినను శీల గురుమతులను వం
దనముగఁ బూజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!
భావం : నీ వంటే ప్రేమించేవారికీ, మంచి ప్రవర్తన గలవారికి నమస్కారము చేయి. అవతలివారు ఆనందించేట్లు, నడుచుకోవడం బుద్దికలవారు చేసే పని.
ఉన్నను లేకున్నను పై
కెన్నడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్నతలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁదిరుగు మెలమిఁగుమారా!
భావం : నీకు ఉన్నా, లేకున్నా బయటికి తెలియనీకు. ఎప్పుడైనా నీకు రహస్యాలు తెలిస్తే, వాటిని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకు. నీ కన్న తల్లిదండ్రులకు కీర్తి దశదిశలా వ్యాపించేలా చేయి.
పెద్దలు విచ్చేసినచో
బద్దకమునైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెఱిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
భావం : కుమారా! పెద్దలు నీ వద్దకు వస్తే, బద్దకంగా చేతగాని, చెడు మార్గానగాని అమర్యాదగా ప్రవర్తించకు. అలాగే చేస్తే, నిన్ను మూర్ఖునిగా చూస్తారు.
సతతముఁ బ్రాతఃకాలో
చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ సహః
పతి పూర్వపర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా!
భావం : ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందే, నిద్రలేచి నీవు చేయవలసిన పనులు వేగంగా, శ్రద్ధతో చేసుకో.
పోషకుల మతముఁగనుగొని
భూషింపగ గాని ముదము బొందరు మఱియున్,
దోషముల నెంచుమందురు
దోషివయిన మిగులఁ గీడు దోచుఁ కుమారా! 10
భావం : నిన్ను పోషించేవారి ఇష్టం తెలుసుకుని మసలుకో. నీవు ఎంత గౌరవించినా అతడు సంతోషించడు. పైపెచ్చు నీ తప్పులనే వెతుకుతూ ఉంటాడు. నీవు చెడ్డవాడివైతే పలు కష్టాలు కలిగిస్తాడు.
నరవరుడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమున (గీర్తి (బొందుఁకుమారా!
భావం : రాజు ఎవరిని నమ్మి తన పనులు చేసేందుకు సేవకుని నియమిస్తాడో, ఆ సేవకుడు సరిగ్గా చేయాలి. చేస్తే లోకంలో కీర్తి సంపాదిస్తాడు.
ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుడనుచు దలతె ? కుమారా!
భావం : ఈ లోకంలో ధనవంతుడు, అన్ని మంచి లక్షణాలు కలవాడిగా భావిస్తారు. సంపద కలవాడినిగా , గొప్ప కులంలో జన్మించినవాడినిగా అందగాణ్ణిగా బలవంతునిగా, ధైర్యశాలిగా భావిస్తారు.
పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపుధీయుక్తుడవై
వినగోరుము సత్కధలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
భావం : ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ప్రతి దినం జ్ఞానం పెంచుకొనేందుకు, మంచి కథలు విని, తెలుసుకొనే ఆసక్తి చూపితే, బుద్దిమంతులు వారిని చూసి ఆనందిస్తారు.
ధరణీ నాయకు రాణియు
గురు రాణియు నన్నరాణి కులకాంతను గ
న్నరమణి దనుగన్న దియును
ధరనేవురు తల్లులనుచుఁ దలుపు కుమారా!
భావం : దేశాన్ని పాలించే రాజుగారి భార్య రాణి, గురువుగారి భార్య, అన్నగారి భార్య, తన భార్యను కన్న తల్లి అనగా అత్తగారు, తనను కన్న తల్లి ఈ ఐదుగురినీ తల్లులుగా భావించాలి.
సదమల మతితోఁబెద్దల
మదికింపుగ మెలగు, నిందమానుము పరులన్
మృదుమార్గములను వదలకు
విదితంబుగ దానఁ గీర్తి వెలయు గుమారా!
భావం : మంచి బుద్ది కలిగి పెద్దల మనసుకు, సంతోషం కలిగేట్లు మసలు కోవాలి. మంచి మార్గం విడువరాదు. ఇలా చేస్తే నీకు మంచి కీర్తి లభిస్తుంది.
ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నింద సేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య కుమారా !
భావం : గురువు మాటకు ఎదురు చెప్పకు. చేరదీసిన వారిని నిందించకు. చేసే పనిపై ఎక్కువ ఆలోచింపకు. మంచి మార్గం వదలి పెట్టవద్దు.
కల్లలగు మాట లాడకు
మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లగఁ బల్కుము నీకది
తెల్లము రహిఁగీ ర్తిఁగాంచు దెరగు కుమారా!
భావం : అబద్దాలు చెప్పకు, అందరూ ఆనందించేలా మాట్లాడు. అది అందరికీ ఆనందమే! మంచి పేరు గడించేందుకు మార్గం.
ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ
బూనకు మసమ్మతయి బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!
భావం : ఎప్పుడూ వినయంగా ఉండు. అధికారులతో పట్టుదలకు పోకు. వారికి ఇష్టంలేని పనులు చేయవద్దు. అలా చేయడం సమాజంలో గౌరవం పొందేందుకు మంచి మార్గం.
చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం; బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనను నొచ్చుకూత కుమారా!
భావం : చేయరాని పనులు చేయ వద్దు. మంచి పనులను విడువవద్దు. శత్రువుల ఇంట భోజనం చేయవద్దు. ఇతరుల మనసు బాధపడేట్లు మాట్లాడవద్దు.
పిన్నలు పెద్దలయెడ గడు
మన్ననచే మెలగు సుజన మార్గంబులనీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్నియెడల వెన్నఁబడదువన్న కుమారా! 20
భావం : చిన్నవారైనా, పెద్దవరైనా మర్యాదగా ప్రవర్తించు, అలా చేస్తే మంచి వారని పిలుస్తారు. సరిగ్గా నడచుకుంటే లోకంలో కీర్తి గడిస్తారు. అంతా మెచ్చుకుంటారు.
తనకు విద్యాభ్యాసం
బును జేసినవానికన్న బొలుపుగఁబదిరె
ట్లను దూగు దండ్రి వానికి
జననీయుఁ బదిరెట్లుఁదూగు జగతిఁ గుమారా!
భావం : విద్యాభాసం చేసిన గురువు కంటే తండ్రి పదింతలు ఎక్కువ. కన్న తల్లి తండ్రి కంటే పదింతలు ఎక్కువ. ఇది లోకంలో సంగతి.
తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మున బ్రేమింపఁ గీర్తి దనరుఁకుమారా!
భావం : అన్నగారంటే తమ్ముళ్ళకు భక్తి ఉండాలి. అలాగే తమ్ముళ్ళు అంటే అన్న ప్రేమతో ఉండాలి. అప్పుడే వారిద్దరి మధ్య సఖ్యత ఉంటుంది. మంచి వారని అనిపించుకుంటారు.
అప్పం దన తల్లి గ మే
లొప్పంగని జరుపవలయు నుర్వీస్ధలిఁజి
న్నప్పుడు చన్నిడి మనిపిన
మప్పడతియు మాటృతుల్యయండ్రు కుమారా!
భావం : తోబుట్టువులను తల్లి లాగా చూడాలి. ఈ లోకంలో పాలిచ్చి పెంచిన స్త్రీని కూడా తల్లి అంటారు. తల్లికాకున్నా సరే!
బూటకపు వర్తనముఁ గని
జూటరి వీడనుచుఁ దప్పఁజూతురుగా ! యా
బాటను విడి సత్యము మది
బాటించి నటించు వాడె నరుడు కుమారా!
భావం : కపట మార్గం పోవద్దు. అబద్దాలు చెప్పేవారిని, మోసగాళ్ళను ఎవరూ నమ్మరు. కనుక చెడు బాట నడవద్దు, సత్యం మనసులో ఉంచుకుని, నడచుకునేవాడే మనిషి.
ధరణిని పరోపకారా
చరణ వ్రతనిష్ఠనెపుడు సలుపుము నీకా
తెరుగుప వాసాదివ్రత
వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా!
భావం : ఈ లోకంలో ఎప్పుడూ నిష్ఠతో ఉపకారమే చేయాలి. ఎందుచేతంటే ఉపవాసాలు, వ్రతాలకంటే ఉపకారం చేస్తే ఎక్కువ ఫలం పొందుతారు.
వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
భావం : జరిగిన దానికి చింతించకు, చెడ్డవారిని ఎలాంటి పరిస్థితులలో పొగడకు. సాధ్యం కాని పనులు వదిలిపెట్టు. దైవం ఎలా నడిపితే అలాగే జరుగుతుంది.
పని బూని జనులు సంతస
మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొందుచుందురు
గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారాఁ
భావం : జనులు సంతోషంతో సత్యం వీడక పని చేస్తే కీర్తి గడిస్తారు. ఇది మంచి పని అని తెలుసుకోవాలి.
సరి వారి లోన నేర్పున
దిరిగెడి వారలకు గాక తెరవాటులలో
సరయుచు మెలగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా !
భావం : నీ స్నేహితులు మంచి వారైతే నీకు గౌరవం, దుష్టులైతే నీకు అగౌరవం లభిస్తాయి. ఇది అనుభవం మీద తెలుస్తుంది.
బరులెవ్వరేని దనతో
బరిభాషించినను మేలు పలుక వలయునా
దరము గల చోటఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర కుమారా !
భావం : ఇతరులతో మంచి మాటలనే మాట్లాడాలి. చెడు మాటలు పలుకరాదు. ఆదరం ఉన్నచోట కీడు కలిగేలా చేసుకోరాదు కదా!
సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁ బొగడించునంచు దలపు కుమారా ! 30
భావం : సంపద అనేది బంధువులను పెంచుతుంది. సంపద శుభాలను కలుగజేస్తుంది. సంపద వలన స్నేహితులు పెరుగుతారు. సంపద గల మానవుని గుణవంతునిగా కీర్తిస్తారు.
మనుజుడు సభ్యుడు దానై
కనియున్న యదార్ధమెల్ల కానిన యట్లా
మనుజుండు పలుకకున్నను
ఘనమగు పాతకము నాడు గనును కుమారా!
భావం : చూచింది చూచినట్లు చెప్పేవాడు మంచివాడు. చూచినా చూడనట్లు చెప్పేవాడు పాపి.
అంగీకార రహితమగు
సంగతికిం బోవరాదు సామాన్యులతో
డం గడు జగడమునకు జన
వెంగలితనమండ్రు జనులు వినుము కుమారా !
భావం : అంగీకార యోగ్యం కాని సంగతుల జోలికి పోరాదు. తక్కువ వారితో గొడవలు తెచ్చుకోవడం అవివేకం. అందువల్ల బుద్దిహీనునిగా చూస్తారు.
అలదేవగృహము కడప యి
రుల గోవాటముల యందు ద్రోవలలోర
చ్చల కొట్టములను నొప్పదు
మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా !
భావం : గుడిముందు, ఇంటిముందు, పశువుల శాలలో, దారిలో, రచ్చబండ వద్ద, మలమూత్ర విసర్జన చేయరాదు.
ధీరుడు తన దగు సంపద
జారిన యెడ జింత నొందజాలక దా ల
క్ష్మీరమణుని వర చరణం
బోరుహములు గొలిచి ముక్తిబొందు కుమారా !
భావం : ధైర్యశాలి అయిన మానవునికి తన సంపదలన్నీ నశించినా, ఏమాత్రం బాధపడక, లక్ష్మీదేవి భర్త విష్ణువు పాదాలను ఆశ్రయిస్తే ముక్తి పొందుతాడు.
పాపపు బని మది దలపకు
చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
లోపల తలపకు, క్రూరల
ప్రాపును మరి నమ్మబోకు, రహిని కుమారా !
భావం : మనసులో చెడు ఆలోచనలకు చోటియవద్దు. కాపాడతానని మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకో దుర్మార్గుల ఆదరణ నమ్మవద్దు.
జగడంబులాడు చోటను
మగువలు వసియించుచోట మదగజము దరిన్
బగతుండు తిరుగుచోటన్
మగుడి చనగవలయుఁ జలము మాని కుమారా !
భావం : తగాదాలు జరిగే చోటు, ఆడవారు నివసించే చోటు, మదించిన ఏనుగు ఉండే చోటు, శత్రువు నివసించే చోటు వదలి వెళ్ళాలి.
తిరుగకు దుర్మార్గులతో
నరుగకు గహనాంతరస్ధలాదుల...
జరుగకు శత్రుల మోల
న్మరుపకు మేల్ హితులయెడల మదిని కుమారా !
భావం : దుర్మార్గులతో కలిసి తిరగవద్దు. ఒంటరిగా అడవులకు పోవద్దు. శత్రువుల చెంత వుండవద్దు. నీ మేలు కోరే మిత్రునికి మంచి చేయడం మరువకు.
సంపదల గల వారిని మో
దింపుచు జట్టుకొని యందు రెల్లప్పుడు స
త్సంపద తొలంగిన ను పే
క్షింపుదు రవివేక జనులు క్షితిని కుమారా !
భావం : ఈలోకంలో అవివేకులు మంచి సంపదగలవారిని, పొగుడుతూ చుట్టూ చేరతారు. సంపద లేకుంటే ఎవరూ దరిరారు. అలాంటివారు ఎంత బుద్దిహీనులో కదా!
కాయమున నాటు శరములు
పాయంబున దీయవచ్చు బహునిఘ్ఠురతన్
గూయ మదినాటు మాటలు
పాయవుగా యెపుడు నెగడు పరచు కుమారా !
భావం : శరీరంపై బాణాలు గుచ్చుకుంటే, నొప్పి లేకుండా తీయవచ్చు. మనసుకు బాధకలిగే మాటలను తీసేయలేం. పైగా ఆ మాటలు బాధను కలిగిస్తాయి.
పెను కోపము గర్వమును
బ్బును జపలము దుభిమానము నిర్వ్యాపారం
బునుఁ జొరవు నునికియును న
ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా ! 40
భావం : ఎక్కువ కోపంతో ఉండడం, గర్వంతో పొంగిపోవడం, నిలకడ లేకపోవడం, తనకు మించినవారు లేరు అనే అహంకారం, ఏ పని చేయకుండటం నీచుని లక్షణాలు.
విత్తము గూర్చిన మనుజుం
డు త్తమ దానంబు భోగ మొందని యెడ భూ
భృత స్కర శిఖి గతము వి
వృత్తికంబగును నట్టి పదవి కుమారా !
భావం : మనిషి ఎక్కువ ధనం సంపాదించి, తగిన దానాలు చేయాలి, అనుభవించాలి, లేకుంటే అది రాజులపాలు లేదా దొంగల పాలు, లేదా అగ్గిపాలు అవుతుంది.
ఘనులు విని సమ్మతింపని
పనులకు జొరబడక పొగడు పనులను జొరు; మెం
దును బొంక బోక కడు స
జ్జనములతో గలసి మెలగు జగతి కుమారా !
భావం : పెద్దలు ఇష్టపడని పనులు చేయవద్దు. పెద్దలు మెచ్చే పని చేయి. ఎప్పుడూ, ఎక్కడా అబద్దాలు చెప్పకు. మంచి వారితో స్నేహం చేయి.
జ్ఞానుల చరితము వీనుల
నానుచు సత్పురుష గోష్ఠి ననఘంబనుచున్
బూనుము, ధర్మపథం బును
దా నెరిగినయంత, మరువదగదుకుమారా !
భావం : మంచివారి చరిత్ర తెలుసుకునేందుకు ఆసక్తి చూపు, మంచివారి స్నేహం పాపాలను పోగొడుతుంది. నీకు తెలిసిన ధర్మం విడవ వద్దు.
రోషా వేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరము నౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోపకుమారా !
భావం : కోపం, ఆవేశం అనేవి, మనిషికి పాపం కలుగజేస్తాయి. సుఖాఃనికి కారణం అవుతాయి. కాబట్టి మంచి కోరేవారు వాటిని విడవాలి.
సభలలోపల నవ్విన యెడ
సభవార్ని రసింతు రట్టి జనుని న్నెరి నీ
కభయం బొసంగె నేనియు
బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా !
భావం : సభలోపల నవ్వవద్దు. అలా చేస్తే గొప్పవాడినైనా ఆక్షేపిస్తారు. రాజుగారి ఆదరణ పొందినంత మాత్రాన, దాన్ని మనసులో ఉంచుకోని గర్వపడరాదు.
పెరవారలుండ ఫలముల
నరయంగా వారికిడక యాతడెమెసవన్
సరిగాదు విసపు మేతకు
సరియౌనని తలపు మానసమున కుమారా !
భావం : ఇతరులు మన వద్ద ఉంటే, పండు వారికి పెట్టి, మనం తినాలి. అలా కాకుండా మనం తినడం మంచి పని కాదు.
గుణవంతుని సంగతి ని
ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ
ర్పణమున వస్త్రాదిక మా
క్షణమున పరిమళము నొందు కరణి కుమారా !
భావం : సువాసన వచ్చే పువ్వుల వలన, వస్త్రాలు, ఇతరాలు సువాసనలు వెదజల్లుతాయి. అలాగే మంచివారితో స్నేహం చేస్తే, మంచిగుణాలు అబ్బు తాయి.
పరజనులు కట్టి విడిచిన
వర చేలములైన గట్ట వలదు వలువలన్
నెరి మాయు మడత మార్చుచు
ధరియించుట యొప్పదండ్రు ధరను కుమారా !
భావం : ఇతరులు కట్టి విడిచిన బట్టలు, ఎంత విలువైనవైనా ధరించరాదు. అలాగే ఎంత అందమైన బట్టయినా నలిగిన మడత కనబడేట్టు కట్టరాదు.
అవయవ హీనుని సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరాని యతని సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా !
భావం : వికలాంగులను, అందవిహీనులను, ధనహీనులను, విద్యావిహీనులను, గౌరవింపదగినవారిని, భగవంతుని, వేదాలను, నింధించరాదు, నిందించడం తగనిపని.
మనుజులు తన సౌఖ్యము కొర
కును సంరక్షణము నవని గోరుదు రొగినే
జన పాలుఁడు సంరక్షిం
పను దగియును బ్రోవ డతడె పాపి కుమారా ! 50
భావం : మనుషులు తమ సుఖం కోరి, తమకు రక్షన కోరుకుంటారు. బాధితులను రక్షించే శక్తి కలిగిన రాజు రక్షింపకపోతే అతనిని పాపాత్ముడంటారు.
గరళము పెట్టెడు వాని
పరు జంప దలంచువాని బనులెల్ల బయ
ల్పరచెడివానిం బరధన
హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా !
భావం : విషంతో ఇతరులను చంపేవారిని, ఇతరులతో చంపదలచుకున్న హంతకులను, రహస్య విషయాలు బయట పెట్టే వారిని, ఇతరుల ధనాన్ని దొంగిలించేవారిని, చంపడం వలన రాజు పుణ్యం చేసిన వాడు అవుతాడు.
కత్తిని చేతం బట్టుచు
మొత్తదలచి వచ్చువాని ముఖ్యముగా మే
ల్వత్తించిన నదె ప్రాయ
శ్చిత్తమని జంపదగదు చిన్ని కుమారా !
భావం : ఖడ్గం చేతపట్టి చంపుతానని మీదకు వచ్చేవారిని, మనం చంపకుండా అతనికి మేలు చేయడం, అతనికి మంచి శిక్ష. అలా మీదకు వచ్చిన వారిని చంపరాదు.
ఓరిమియె కలిగి యుండిన
వారలగని ప్రజ్ఞలేనివారని యెద రౌ
నారయ సత్పురుషావళికి
నోరిమియే భూషణంబు రోరి కుమారా !
భావం : మనిషి సహనం కలిగి ఉండాలి. కొందరు ఇలాంటివారిని తెలివి లేనివారు అనుకుంటారు. నిజానికి మనిషికి సహనం మంచి ఆభరణం.
పురుషుం డొనర్పని పనికి
నరయగ దైవం బదెట్టులనుకూలించున్
సరణిగ విత్తక యున్నను
వరిపండునె ధరణిలోన వరలి కుమారా !
భావం : మనిషి సరైన ప్రయత్నం చేయకపోతే ఫలితం రాదు. అలాగే భూమిలో మంచి విత్తనం నాటకపోతే వరి పండదు.
చము రింకిపోయినను దీ
పము శమియించిన విధంబు పౌరుష విహీ
నమె యగును; దైవ మనుకూ
లము గాకుండినను భూతలయిన కుమారా !
భావం : చమురు అయిపోతే, దీపం కాంతి తగ్గి కొండెక్కుతుంది. అలాగే భగవంతుడు అనుకూలించకపోతే మనిషికి పౌరుషం ఉపయోగించదు.
ధరనే వస్తువులైనన్
దరగుటకై వృద్ధినొందు దగ బొడవెదుగున్
విరుగుటకై పాయుటకై
దరిజేరును వీని మదిని దలతె కుమారా !
భావం : ఈ లోకంలో ఏ వస్తువైనా పెరగడం, తరగడానికే, మితిమించిన పొడవు విరగడానికి, ఎక్కువ సమీపంలో చేరడం దూరం అయ్యేందుకే.
జనియించుట పొలియుటకె
పెను సుఖమొందుటది కష్ట విధి నొందుటకే;
విను హెచ్చుట తగ్గుటకే;
యని మనమున నమ్మవలయునయ్య కుమారా !
భావం : మానవులు జన్మించడం మరణించడం కోసమే. మిక్కిలి సుఖాలను అనుభవించడం, కష్టాలను అనుభవించడం కోసమే! ఇది నమ్మండి.
పుడమిని దుష్టత గల యా
తడు లంచంబులు బట్ట దలచుచు మిడియౌ
నడవడి విడి యందిరి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు వరుప కుమారా !
భావం : దుష్టబుద్ది కలవాడు దుర్భుద్దితో లంచాలు పట్టేస్తాడు. గర్వంతో తనతో పని ఉన్నవారిని, తన చుట్టూ అనేక సార్లు తిప్పుకుంటాడు. వారికి నష్టాలు కలిగిస్తాడు.
ప్రజ్ఞావంతుని చేతను
ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
బ్రాజ్ఞత గల్గి నటించిన
దత్ జ్ఞున్నుతియింతురదియే ధనము కుమారా !
భావం : ఈ లోకంలో తెలివికలవాని వలన, తెలివి లేనివానికి కష్టాలు కలుగుతాయి. తెలివిగలవారు సరిగా మెలిగితే, వారిని జనం పొగుడుతారు. అదే సంపద.
దీనుండైనను శాత్రవు
డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
మానవుని కోర్కెదీర్చిన
వాని సుజనుడండ్రు బుధులు వసుధ కుమారా ! 60
భావం : శరణు కోరి వచ్చినవాడు శత్రువైనా, ప్రేమతో ఆ వచ్చినవారి ప్రయోజనం, నెరవేర్చితే వారిని పండితులు మంచివారు అంటారు.
తనుజులను గురు వృద్ధుల
జననీ జనకులను సాధుజనుల నెవడు దా
ఘను డయ్యు బ్రోవడో యా
జనుడే జీవస్మృతుండు జగతి కుమారా !
భావం : ఒక వ్యక్తి గొప్పవాడై ఉండి కూడా, కుమారులను, గురువులను, వృద్ధులను, తల్లిదండ్రులను, సత్పురుషులను రక్షించడో, అతడు ఈ లోకంలో జీవించినా, మరణించినట్లే లెక్క.
దుర్జనుల నైనఁదిట్టకు
వర్జింపకు సుజన గోష్టి, పరులను నెల్లన్
నిర్జింతుననుచుఁద్రుళ్లకు;
దుర్జనుడండ్రు నిను నింద దోపకుమారా !
భావం :చెడుపనులు చేసే వారినైనా నిందించ వద్దు, మంచివారితో మాట్లాడేప్పుడు విడిచి వెళ్ళ వద్దు. అందర్నీ చంపేస్తానని బెదిరించవద్దు. అలా చేస్తే నిన్ను చెడ్డవాడు అంటారు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in